Content feed Comments Feed

ఓంకారం – హిందూ సర్వస్వం

హిందూ ధర్మం మొత్తానికి అర్థం ఓంకారంలోనే ఉంది. ఆ మూల తత్వం పూర్తిగా అర్థం చేసుకుంటే తప్ప హిందూత్వం లోని ఏకాత్మత అర్థమయి సకల సందేహాలు తీరవు. హిందూ మతం మొత్తాన్ని ఒక్క వాక్యంలో చెప్పటం కాదు. ఒక్క పదంలో చెప్పటం కాదు. ఒక్క అక్షరంలో చెప్పవచ్చు. అదే “ఓం”. ....

ఆత్మహత్య దిశగా హిందుత్వం

ఒకనాడు విశ్వమంతటికీ జ్ఞానజ్యోతిని చూపిన హిందూ ధర్మం నేడు మినుకుమినుకు మంటూ ఉంది. ముందు జాగ్రత్తపడితే అది భద్రంగా ఉంటుంది. కానీ ఏ ప్రయత్నం చేయకుండా "ఇది నశించదు,శాశ్వతంగా ఉంటుంది" అని ఏదో సమాధానపడిపోతూ నిమ్మకునీరెత్తినట్లు ఊరుకుండిపోయేవారెక్కువయ్యారు. ఒకనాడు ప్రపంచమంతా వ్యాపించిన హిందూ ధర్మానికి ప్రపంచంలో నేటి ఉనికి ఎంత?...

గోమాత

హిందూ ధర్మంలో గోవుకు చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఎంతో విలువైన గోవు హిందువులకు పవిత్రమైనది. అంటే ప్రపంచ మానవాళికే ముఖ్యమైనదని అర్థం. అలా గ్రహింపక మతదృష్టితో చూచి ప్రపంచం చాలా నష్టపోతోంది. ఎవరేమన్నా హిందువులకది తల్లివంటిది, దైవం వంటిది కూడా. అది హిందూ శబ్ద లక్షణంలోనే చెప్పబడింది.
CahayaBiru.com

ఓంకారాన్ని కర్మార్థం ప్రయోగించేటప్పుడు మూడు మాత్రలుగాను, ధ్యానకాలంలోను, ఆత్మోపాసనలోను అర్థమాత్ర అధికంగా పల్కాలి. అంటే మామూలుగా పూజాది కర్మలలో పల్కే దానికంటే అర్థమాత్రకాలం ఎక్కువగా ప్రత్యేక ప్రణవధ్యానంలో, ప్రణవ రూపమైన ఆత్మోపాసనలో పల్కాలి. ఓంకారాన్ని తన ఎదుట వ్రాసుకొని ఆ అక్షర స్వరూపాన్ని ధ్యానిస్తూ దానియందు లగ్నుడై ఉంటే సమస్త ధర్మశాస్త్రాలూ పఠించినట్లే అని చెప్పబడింది. ప్రతి ప్రాణిలో ప్రణవ ధ్వని స్వాభావికంగా ఉంటుంది. అంతఃకరణ నివాసియగు ఆత్మయే బ్రహ్మము. అదే ఓంకారము. కాబట్టి అందరిలోను ఆత్మరూపమగు ఓంకారం ఉంది. దానిని ప్రత్యక్షంగా భావన చేయగల్గుటే ధన్యత. ఓంకార జపధ్యానాదుల వలన ఆ ధన్యత చేకూరుతుంది. మనలోని ప్రాణ నాదం ఓంకారమే. అదే సోహం. అదే హంస; పరమహంస. ఓంకారం యొక్క రూప నిష్పత్తి గూర్చి ప్రపంచసారంలో మంత్ర సృష్టి ప్రకరణంలో ఇలా చెప్పబడింది. "యోయం పరమ హంసాఖ్య - మంత్ర స్సోహ మితీరితః సహోర్లోపే కృతే పూర్వ - సంధ్యా ఓమితి జాయతే| అంటే "సోహం" అనే పరమ హంసాఖ్య మంత్రం నుండి సకారహకారముల లోపంతో "ఓం" అనేది ఏర్పడుతున్నది. ఓంకార ధ్యానం వలన కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనబడే అరిషడ్వర్గం జయింప బడుతుంది. అమాత్రము, అనంత మాత్రము, ఏకత్వాన్ని భాసింపజేసేది, మంగళ ప్రదమైనది అయిన ఓంకారాన్ని గుర్తించిన వారే మునులు అనబడతారు. స్థూల దేహానికి సూక్ష్మదేహం కారణమని, సూక్ష్మదేహానికి కారణదేహం కారణమని, దానికి పరబ్రహ్మ కారణమని గ్రహించి, స్థూలదేహాన్ని సూక్ష్మదేహమునందు, సూక్ష్మదేహాన్ని కారణ దేహమునందు, కారణ దేహాన్ని పరమాత్మయందు లయం చేయుచు నాల్గు దళాల ప్రణవాన్ని భావనచేసి ఆ పరబ్రహ్మమే తానని గ్రహించుటే ప్రణవోపాసన తాత్పర్యం. "ఓంకారేణ ప్లవేనైవ సంసారాబ్ధింతరిష్యతి" అని సంసార సముద్రం దాటాలంటే ముఖ్యమైన నావ ఓంకారమే. ఓంకారం లేని స్థానం, ఓంకారం లేని క్షణము, ఓంకారం వ్యాపించని జీవకణము జగత్తున లేదు. వేదశాస్త్రాది విద్యలన్నీ వాచ్యార్థాలైతే వాటి లక్ష్యార్థం ఓంకారం. ఓంకారంలోని అకారము నందు నరులు, ఉకారము నందు దేవతలు, మకారమున రాక్షసులు, అర్థమాత్రమున తత్వవేత్తలు పుట్టారని కూడా వేదం చెప్తోంది. ముక్కుపై దృష్టిని నిల్పి, కరచరణాది అవయవాలను దగ్గర చేసికొని, మనసును ఇతరములపైకి పోనీయక ఓంకారాన్ని ఉచ్చరిస్తూ బ్రహ్మభావన చేయాలి. "ప్రణవోహి పరబ్రహ్మా - ప్రణవః పరమం పదం; ప్రణవం సర్వవేదాద్యం - సర్వదేవ మయం విదుః" ప్రణవమే పరబ్రహ్మము. ప్రణవమే ముక్తి, ప్రణవమే సర్వవేదాలకు మూలం. ప్రణవమే సకల దేవతల మయమైనది కాబట్టి "అనయా సదృశీ విద్యా - అనయా సదృశీ జపః అనయా సదృశం పుణ్యం - న భూతో న భవిష్యతిః|" ఓంకారంతో సమానమైన విద్య లేదు. దానితో సమానమైన జపం లేదు. దానితో సమానమైన పుణ్యము కూడా మరొకటి లేదు. ఉండబోదు అని కూడా స్పష్టంగా చెప్పబడింది. కాబట్టి ఆ ఒక్క అక్షరంతో మనం సమస్తం సాధింపగల్గినందున అనుక్షణం ప్రతి చర్యయందూ ఆ ఓంకారాన్ని సద్వినియోగం చేసుకుందాము.

మరికొంత వచ్చే టపాలో...

అలా మహాజ్ఞానులకే కాక అజ్ఞానులకు, నిరక్షరాస్యులయిన వారికి కూడా మొదట అవసరమైనది ఓంకారమే. ఎవ్వరికయినా అక్షరాభ్యాసం "ఓం నమః శివాయ సిద్ధం నమః" అనే మొదలుపెడతారు. ఆ విధంగా ప్రతిమనిషికీ మొట్టమొదట నేర్పే అక్షరమే ఓంకారం. ఈ ఓంకారాన్ని అందరూ ఉచ్చరింప కూడదని కొందరంటారు. కాని ఈ అక్షరాభ్యాస సంప్రదాయమే ఓంకారం విషయంలో అలాంటి భేదాభిప్రాయం తగదని చెప్తోంది. ఆయా సంప్రదాయాలను బట్టి అక్షరాభ్యాసం "ఓం గణేశాయనమః" అని కొందరు, "ఓం నమో నారాయణాయ" అని కొందరు చేయటం ఉంది కాని మొదట ఓంకారాన్ని చెప్పే విషయంలో మాత్రం తేడాలేదు. అలా ఓంకారం అన్ని సంప్రదాయాల వారికి మొదటి అక్షరం. భగవద్గీతలో "అక్షరం బ్రహ్మ పరమం" అని సూచితమైనదే సర్వులకూ గ్రాహ్యం.

కృష్ణుడు అర్జునునకు ఉపదేశించటం బట్టి, యముడు నచికేతునకు ఉపదేశించటం బట్టి ప్రణవోచ్చారణకు వర్ణాశ్రమ భేదాలు లేవని, శివుడు మృగశృంగుని భార్యలకుపదేశించటం బట్టి ఓంకారోపదేశానికి లింగభేదం లేదని, గరుడపురాణంలో వైకుంఠాన గరుత్మంతునకు సాక్షాన్నారాయణుడుపదేశించుట బట్టి మానవేతరులకు సైతం ఓంకారం గ్రాహ్యమే అని తెలుస్తుంది. కాబట్టి వీరు వారనక సర్వులూ ఓంకారాన్ని స్మరిస్తూ ఐహిక పారమార్థిక ప్రయోజనాలన్నీ పొందవచ్చు. కాబట్టే "నిరక్షర స్యాపి తు యస్య కుక్షౌ - బ్రాహ్మైవ చా భాతి స ఏవ సాక్షర:| సర్వాక్షర స్యాపి తు యస్య చిత్తే - బ్రహ్మైవ నా భాతి సవై నిరక్షరః|. ఎవరి హృదయంలో అక్షర స్వరూప పరబ్రహ్మ అనగా ఓంకారం జరుగుతుందో వాడే అక్షర కుక్షి, అక్షరాస్యుడు. అట్టి ఓంకారం లేనివాడు ఎన్ని శాస్త్రాలు చదివిన వాడయినా నిరక్షరాస్యుడే" అని చెప్పబడింది.

సమస్త వాఙ్మయమూ ఓంకారం నుండి పుట్టినదే. నాభి నుండి బయలుదేరిన నాదం నోటి ద్వారా బయటకు వచ్చేలోగా అంతర్నాడీ చలనం బట్టి 12 శ్రుతి భేదాలతో నాభి, హృదయ, కంఠ, నాసికా, రసనాది స్థాయి భేదాలతో సప్త స్వరాలుగా వెలువడుతుంది. ఇదే సంగీత శాస్త్ర మంతటికీ కారణమయినది. ఆ స్వరముల పుట్టుకకే కారణమయిన నాదం ఓంకారం సంగీతమునకు మూలమౌతున్నది. ఓంకారం వేదాల సారం. ఉపనిషత్తులన్నీ దీని మహిమను గానం చేస్తున్నాయి. యోగశాస్త్రం దీనినుపాసిస్తోంది. ఇది పరమేశ్వరుని వలె అవ్యయము, నాశరహితము, ఏకాక్షరము, లింగ విభక్తి వచన రహితము, సర్వగర్భము, అతి గంభీరము. సమస్త బ్రహ్మాండం దీనియందిమిడి ఉంది. అ+ఉ+మ్ = ఓం. ఓంకారంలోని అ-ఉ-మ్‌లు త్రిమూర్తులు, త్రికర్మలు, కాలత్రయ, గుణత్రయాది సకల త్రిపుటి సముదాయానికి ప్రతీకలు.

ఓం అనేది అంగీకార సూచకం. అనాదిగా ఋషివరుల సదస్సులందు అందరి ఆమోదం తెల్పుట ఓంకారం పల్కటం ద్వారా జరిగేది. ఒక ప్రతిపాదనను అంగీకరించటమంటే అందరూ కేవలం చేతులెత్తటం కాదు. దానితో బాటు ఓంకారం పల్కటం మన సంప్రదాయం. ఆ ప్రతిపాదన, తీర్మానము, సక్రమంగా అమలు జరుగుటకు కేవలం మనుష్య బలం అందించటమేగాక ప్రణవ శక్తి ద్వారా పరిపూర్ణ దైవ బలం సమకూర్చటమౌతుంది. కాబట్టి ఈ మన సంప్రదాయం గుర్తించి అన్ని సమావేశములందూ తీర్మానాలను ఓంకారంతో ఆమోదింపజేయటం ఆరంభించాలి. ఆంధ్రవాచ స్పత్యాది నిఘంటువులలో కూడా సమ్మతి అనుదానికి సూచకంగా ఓంకారం చెప్పబడింది. విజ్ఞులు ధార్మిక సంస్థల, దేవాలయాదుల సమావేశాలలో ఆరంభించి క్రమంగా అవకాశమున్న అన్ని సమావేశాలలో ఈ సత్సంప్రదాయాన్ని ప్రవేశపెట్టాలి.

స్వాధ్యాయ బ్రాహ్మణం 11 వ అనువాకంలో ఓంకారంతో భూర్భువస్వః అనే వ్యాహృతి త్రయం ఉచ్చరించుటచే వేద త్రయం పఠించిన వాడౌతాడని ఉంది. మనుస్మృతిలో మనువు కూడా ఓంకారాన్ని వేదత్రయాత్మకంగా చెప్పాడు. మనం వేదమంతా ఎటూ చదువలేము. కనీసం వేద త్రయాత్మకము, వేదమునకు మూలము, అయిన ఓంకారాన్ని స్మరిస్తూ ఆ వేదపఠనం గావించిన ఫలం కొంత పొందగల్గుతాము. ఈ ఓంకారోచ్చారణ కూడా "తైల ధారావ దచ్ఛిన్నం - దీర్ఘం ఘంటా నినాదవత్ ఆప్లుతం ప్రణవస్యాంతం - యస్తం వేద సవేదవిత్" నీళ్ళవలె విడివిడిగా కాక తైలధారలాగా అవిచ్ఛిన్నంగా, ఘంటానినాదం వలె దీర్ఘంగా ఎవడు పల్క గల్గునో వాడు నిజంగా వేద విదుడని చెప్పబడింది. కాబట్టి అలా ఉచ్చరించాలని గ్రహించాలి.

మరికొంత వచ్చే టపాలో...

అమాంతం ధనికులం కావాలనే ఆశతో మతం మారేవారున్నారు. వారికి ధనయోగం ఉన్నప్పుడు ఏదోవిధంగా వారేపని చేసినా కలిసి వచ్చి సంపద చేరుతుంది. హిందూ దేవతల నారాధించే వారంతా ధనంలేని వారు కారు, అన్యమతాల వారు అంతా ధనవంతులూ కారు. ధన, దరిద్రాలు వారి వారి ప్రారబ్ధం బట్టి ఎక్కడున్నా వచ్చి తీరుతాయి. కాని ముక్తి మాత్రం ఓంకారాత్మక దేవతా ఆరాధనతోనే లభిస్తుందనేది సత్యం. ఈ మహత్తరావకాశం కోల్పోవటం దురదృష్టం. ఈ అదృష్టం కోసం అన్యమతాల విజ్ఞులంతా ఇటు వైపు చూస్తుంటే దీనిని వదలుకొనటం ఎంత దురదృష్టం? హిందూ దేవతలు ముప్పది మూడు కోట్లనటం సింబాలిజం మాత్రమే. ఋగ్వేదంలో ప్రధానంగా 33 దేవతలు స్తుతింపబడ్డారు. దాని ఆధారంగా 33 కోట్లు అంటున్నారు తప్ప అది నిజ సంఖ్యకాదు. ఏ స్వభావం కలవారికి వారికి తగిన రీతిగా ఈ ఓంకార మూలం నుండి సకల దేవతలూ ఉద్భవించి భుక్తి ముక్తి ఫలాలిస్తున్నారు. తుదకు సమస్తం లీనమయ్యేది ఓంకారంలోనే.

సృష్టి అంతా లయం అయిన పిదప మిగిలేది నాదబ్రహ్మం మాత్రమే. పంచభూతాలలో సూక్ష్మాంశ అయిన ఆకాశం యొక్క శక్తి నాద బ్రహ్మము. సృష్టికి ఆదియందు మూలకారణంగా ఉన్నదీ నాదబ్రహ్మమే. ఆ నాదబ్రహ్మమే ఓంకారం, బ్రహ్మాండము, దిక్కులు, రాత్రింబవళ్ళు ఏవీలేని సృష్ట్యాది దశలో ఒక అవ్యక్త నాదం వినవచ్చింది. అదే ఓంకారం. దాని ధ్వనితరంగాలు క్రమంగా వ్యాపించి దిక్కులు ఏర్పడ్డాయి. ఆయా దిక్కుల నుండి భిన్న ఛందస్సులు, వేదాలు క్రమంగా దాని ఆధారంతో సృష్టి ఏర్పడింది. సృష్ట్యారంభంలో ఒక అవ్యక్త నాదం ఏర్పడిన విషయం అన్యమతాలూ అంగీకరిస్తున్నాయి. అదే మన ఓంకారమనే యదార్థ విషయం అంగీకరిస్తే తమ మత వ్యాప్తికి భంగమని దానిని చెప్పరు. మాండూక్యకారికలలో "సర్వస్య ప్రణవోహ్యాదిః - మధ్యమన్త స్తథైవచ| ఏవం హి ప్రణవం జ్ఞాత్వా - వ్యశ్నుతే తదనంతరమ్" అని చెప్పబడింది. అది ప్రపంచమంతకూ ఆది, మధ్య, అంతము కూడా ఓంకారమే అని, దానిని తెలిసికొనటం వలన పరమ ప్రయోజనం పొందగలడని చెప్తోంది. "ప్రణవం హీశ్వరం వింద్యాత్ స్సర్వస్యహృది సంస్థితం; సర్వ వ్యాపినమోంకారం మత్వాధీరో నశోచతి|" అంటే సర్వప్రాణుల హృదయాలలో ఈశ్వరునిగా ఉన్నది ఈ ఓంకారమే అని గ్రహించాలి. సర్వవ్యాపి అయిన ఓంకారాన్ని గ్రహింపగల్గితే ఇకవానికి శోకం అనేది ఉండదు.

మనం ముందు చెప్పుకున్న బ్లడ్‌ప్రెషర్, ఆవేశాదులు తగ్గటం వంటివే కాక ఓంకారంతో లౌకిక ప్రయోజనాలూ ఎన్నో చెప్పారు. నల్లని మందమైన "ఓం"కార చిత్తాన్ని అరచేతిలో ఉంచుకొని నిశ్చల దృష్టితో చూస్తూ ఊయలవలె కదిలించటం ద్వారా దృష్టి మెరుగవటం, తలనొప్పి తగ్గటం వంటివి జరుగుతాయని చెప్తారు. ఓంకారాన్ని సక్రమంగా ఉచ్చరించటం వలన నాడీమండలం నిశ్చలమై, నిర్మలమై ఉండి అంతర్గత ఉద్వేగాలు తొలగి ప్రశాంతత సిద్ధిస్తుంది. నిత్యం ఉదయం, సాయంకాలం మూడు నుండి పదకొండు సార్లు దాకా ఓంకారోచ్చారణ చేస్తే దానివలన చేకూరే స్వస్థత జీవితంలోని ఒడిదుడుకులను క్రమపరచి ప్రశాంత జీవితాన్ని అందిస్తుంది. నాడీమండలం శక్తి ప్రేరకం. మన సకల చర్యల ద్వారా అనేక నాడులందు చలనమేర్పడుతుంది కాని సూక్ష్మ నాడులు మాత్రం చలించవు. సూక్ష్మనాడీమండల చలనానికి భ్రుకుటి, వెన్నుపూసలలో విశాల వాయుతరంగాలు సృష్టింపబడాలి. ఓంకారాన్ని సక్రమ విధానంలో ఉచ్చరించటంలోనే అలాంటి సూక్ష్మనాడులు ప్రేరేపింపబడతాయి. ఆ సూక్ష్మనాడుల ప్రేరణ వ్యక్తికి అనేక శక్తులను ప్రసాదిస్తుంది. ఆ క్రమంలోనే అతీత జ్ఞానము, అతీత శక్తులు సాధింపగల్గుతారు. అలా ఓంకారం మనుజునిలో నిద్రాణమై ఉన్న అనేక శక్తులను వెలుగులోకి తేగలదు. మీకు మీరే పరీక్ష చేసుకోవచ్చు. ఓంకారం నిత్యం ఆరంభిస్తే మీలో క్రమంగా వచ్చే మానసిక పరిణామం మీకు ఆనందాన్ని ఆశ్చర్యాన్ని కల్గిస్తుంది. పరిణామ సిద్ధాంతంలో కూడా నరాల చర్యలు అభివృద్ధి అయ్యేకొలది జంతువుల తోక చిన్నదౌతూ మెదడు పెరుగుతూ వచ్చింది. శిరస్సు దిశగా నరాలు చైతన్యాభివృద్ధి గాంచటం పరిణామంలో గుర్తింపదగిన లక్షణం. ఆ క్రమంలోనే మానవుని స్థాయికి చేరేసరికి తోక అదృశ్యమయింది. బుద్ధి శక్తి పెరిగింది.

ఎంతో వైవిధ్యం కల ప్రకృతిలో ఏకత్వాన్ని నిరూపించేదే బ్రహ్మము. అంతా బ్రహ్మమయమే. ఆ బ్రహ్మమునకు ఏకైక ప్రతీక ఓంకారం. అదే అక్షర పరబ్రహ్మం. అక్షర నిర్మాణానికి మౌలికంగా ఎనిమిది అంశాలుంటాయి. అడ్డగీత, నిలువుగీత, వృత్తరేఖ, చుక్క, అథోరేఖ, ఊర్ధ్వరేఖ, ఎడమకు గీత, గాడికి గీత అనేవి. ఈ ఎనిమిది అంశాల సమ్మిశ్రితం ఓంకారం. స్థూలం నుండి సూక్ష్మాంశకు పురోగమించటమే లక్ష్యం. అదే వ్యక్తియందలి జీవాంశ ప్రాధాన్యతకు, పదార్థమునందలి పరమాణు ప్రాధాన్యతకు సూచకము. అట్లే ఓంకారం స్థూలాంశతో ఆరంభమయి సూక్ష్మాంశ అయిన చుక్కతో ముగుస్తుంది. ఓంకార లేఖన నియమాలు ముఖ్యంగా అనేదానికే అన్వయించాలి. ఇతర అక్షరాలలా ఇది కలిపి వ్రాయదగినది కాదు. నాల్గంచెలలో క్రమంగా స్థూలం నుండి సూక్ష్మాంశకు నడుస్తాము.

స్థూల సూక్ష్మ కారణావస్థలు మూడూ భ్రాంతివలన ఏర్పడినవే తప్ప నిజంగా అవి లేవు. ఉన్నది పరబ్రహ్మమొక్కటే. ఆ మూడు అవస్థలూ అసత్యాలు అనే విషయం ప్రణవంలోని అకార ఉకార మకారాల ద్వారా గ్రహించి తానే పరబ్రహ్మము అనే జ్ఞానం పొంది అఖండ ఆనందమయుడై నిల్చునట్లు ఆ ప్రణవం చేస్తుంది. అదే జీవన్ముక్తి, కైవల్య మోక్షము, జీవ బ్రహ్మైక్యము, పరబ్రహ్మ సాక్షాత్కారము, ఆత్మ సాక్షాత్కారము అని కూడా చెప్పబడుతూ ఉంటుంది. జ్ఞాని కోరవలసింది ఆ అవస్థే. కలకంటూ అది యధార్థమనుకొన్నట్లు అజ్ఞానికి ఈ లోకమే శాశ్వతం. అలా అనుకొంటూనే కలకరిగి పోయినట్లు తాను, తనలా లోకంలో సమస్తమూ తొలగిపోతూ ఉండటం ఆలోచించలేడు. జ్ఞానికే సరియైన ఆ జ్ఞానం కలుగుతుంది. అందుకు తోడ్పడేదే ఓంకారం.

మరికొంత వచ్చే టపాలో...

హిందూమతం అనగానే స్వమతస్థులు, విమతస్థులు కూడా ముఖ్యంగా విమర్శించే విషయం, అర్థం చేసుకోలేకపోయే విషయం ఇందులో అనేక పంథాలుండటం, చాలామంది దేవతలుండటం గూర్చి. “ఏకం సత్ విప్రా బహుధావిదంతి” (1 – 164 – 46) అని, “ఏకం సన్తం బహుధా కల్పయన్తి” (10 – 114 – 5) అని ఋగ్వేదం చెప్తోంది. అంటే ఒకే సత్ పదార్థాన్ని పండితులు అనేక విధాల చెప్తున్నారని అర్థం. ఆ ఒకే ఒక్క సత్యపదార్థమే ఓంకారం. హిందూ ధర్మం మొత్తానికి అర్థం ఆ ఓంకారంలోనే ఉంది. ఆ మూల తత్వం పూర్తిగా అర్థం చేసుకుంటే తప్ప హిందూత్వంలోని ఏకాత్మత అర్థమయి సకల సందేహాలు తీరవు. హిందూ మతం మొత్తాన్ని ఒక్క వాక్యంలో చెప్పటం కాదు. ఒక్క పదంలో చెప్పటం కాదు. ఒక్క అక్షరంలో చెప్పవచ్చు. అదే “ఓం”.

మూలాన్ని గమనించకుండా చెట్టుకొమ్మలు, రెమ్మలు వేలాదిగా ఉండటం చూచి “అమ్మో! ఇన్ని భేదాలే!” అని ఆందోళనపడటంలో అర్థం లేదు. అదంతా ఒకే చెట్టు. ఏ కొమ్మ ఎక్కి అయినా కోసుకునేది ఒక ఫలమే. కనీస పరిఙ్ఞానం కలవారికొక్క విషయం అర్థమౌతుంది. చెట్టు మూలం ఒకటే అయి, అన్ని కొమ్మల ఫలాలూ ఒకేరకంగా ఉంటే తప్పకుండా అదంతా ఒకే చెట్టు అని గ్రహిస్తాం. కొమ్మల సమూహాన్ని బట్టి ఎన్నో చెట్లు అనం. హిందూ మతం ఒక చెట్టు అనుకుంటే దాని మూలం ఓంకార రూప పరబ్రహ్మం. ఫలం ఏ కొమ్మ నుండి కోసినా ముక్తి ఫలమే. కాబట్టి అదంతా ఒకే చెట్టు. ఫలస్వరూపంగా అన్నిటినుండీ పొందగలది ముక్తియే. అయినా దానికి వాసనలు గుబాళించే పుష్పాలు, నోరూరించే పచ్చికాయలు, పూతలు వంటివీ ఉంటాయి. అవే ఐహిక ప్రయోజనాలన్నీ. ఏ దేవత నుండి అయినా మనం ఆశించేవి భుక్తి, ముక్తి అనేవే కదా! ఆ వృక్షం అవ్యక్త పరబ్రహ్మమైతే దాని వ్యక్త రూపం ప్రణవం. దీనిని గూర్చి విపులంగా గ్రహిస్తే తప్ప మనలో ఏర్పడే భేద భావాలు తొలగిపోవు.

వృక్షమూలం ఓంకారం. దానినుండే ఇందరు దేవతలనే కొమ్మలు పుట్టి ఆ వృక్ష ఫలమైన భుక్తి ముక్తులనే అన్నీ ప్రసాదించటం జరుగుతోంది. సూర్యుడొక్కడే. అనంత కిరణాలు. అన్ని కిరణాల మూలం ఆ సూర్యుడే. అన్ని కిరణాలు ఫలమూ ఙ్ఞాన జ్యోతి ప్రకాశనమే. అలా ఓంకారం యొక్క కిరణజాలమే సకల దేవతలు. ఏ దేవత అయినా ఓంకారంతో సంబంధించిన వారే. అందుకే ఏ దేవతా మంత్రమైనా, పూజా నామమైనా మూలమైన ఓంకారంతో కలిపే చెప్పాలి. ఓం శివాయ నమః, ఓం నమో నారాయణాయ, ఓం దేవ్వై నమః అంటూ అందరికీ ఓంకారం తోనే చెప్పాలి. ఆ ఏకతను ఎవ్వరూ కాదనలేరు. ఆ ఓంకారం విషయంలో శైవ, వైష్ణవ శాక్తేయాది భేదాలేవీ లేవు.

మన మతంలో అనేకత్వాన్ని భావించడానికి ప్రధాన కారణం భ్రాంతి, అజ్ఞానాంధత. ఒక గురువుగారు గ్రుడ్డి శిష్యులకు ఏనుగును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగిద్దామని దాని దగ్గరకు తీసుకొని పోయి వారు దాన్ని చేతులతో తడిమి గ్రహించాక “ఏనుగు ఎలా ఉంటుంది?” అని అడిగితే ఒకడు అరటిస్తంభంలా ఉంటుందని, వేరొకడు చీపురు కట్టలా ఉంటుందని, ఇంకొకడు పెద్ద పాములా ఉంటుందని, ఇలా ఎవరికి దొరికిన అవయవం పట్టుకొని అదే ఏనుగులా భావించి చెప్పారట. సమగ్ర జ్ఞానం ఎవరికీ లేదు. అలా సమగ్రమైన అవగాహన లేక ఎవరి పంథాను వారు అదే హిందూ ధర్మ సర్వస్వంగా భావించటంతో ఇన్ని అభిప్రాయ భేదాలకు, వివాదాలకు కారణం ఏర్పడుతోంది. నిజానికి మన ధర్మం యొక్క ఏకైక సమగ్ర రూపం ప్రణవం. అంటే ఓంకారం. వేదాలే సమస్తమునకు ఆధారమయితే ఆ వేదాలకు పుట్టుక స్థానం ఓంకారమే. ఎవరు ఏ దేవతను సర్వాధిక దేవతగా అనుకొన్నా ఆ దేవతలందరకూ ఓంకారమే మూలం. “ఓంకారస్సర్వవేదానాం మూలం” అని “ఓంకార ప్రభవా దేవాః” అని సకల వేదాలు, సకల దేవతలు ప్రణవం నుండే పుట్టినట్లు ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మనుష్య జన్మ నెత్తినందుకు సాధింపవలసిన ఆధి భౌతిక, ఆధి దైవిక, ఆధ్యాత్మిక ప్రయోజనాలన్నీ ఈ ఓంకారం వలననే సాధింపబడతాయి. అదే ఈ గ్రంథంలో ముఖ్యంగా నిరూపితమౌతుంది.

ఓంకారం మనలను అన్ని విధాలా రక్షించేది. అసలు ఆ అక్షరానికున్న అర్థమే అది. “అవతి రక్షతీతి ఓమ్” అని రక్షించునది అనియే ఓంకారానికి అర్థం. కాబట్టి మనకు ఓంకారం సర్వదా సర్వధా రక్ష. ప్రణవ మనేది “ణు స్తుతౌ” అనే ధాతువు నుండి పుట్టింది. “ప్రకృష్టో నవః ప్రణవ:” అని పుష్కలమైన స్తోత్రముగా ప్రణవమునకు అర్థం చెప్పబడింది. “యద్వా ప్రణౌతి ప్రస్తూయతే అనయా బ్రహ్మేతి ప్రణవః”. ఈ స్తోత్రము సకల దేవతలకు చెందునది, లేదా సకల దేవాత్మకమగు బ్రహ్మమునకు చెందునది. “ప్రాణాన్ సర్వాన్ పరమాత్మని ప్రణానయతీ త్యేతస్మాత్ ప్రణవః” – సర్వ ప్రాణములను పరమాత్మయందు లగ్నము చేయునది అని కూడా ప్రణవమున కర్థం. “ప్రణౌతీతి ప్రణవః తస్మాత్ ఓమితి ప్రణౌతి ఇతిస్తుతేః” అని విష్ణు సహస్రనామ శంకర భాష్యంలో కూడా స్తుతి పరమైనదిగా ఓంకారం తెలుపబడింది. “ప్రణవష్టేః” అని పాణినిచే వ్యాకరణ సూత్రం వ్రాయబడింది. దానికి భాష్యం వ్రాస్తూ పతంజలి యజ్ఞకర్మల యందు ఋక్కుల యొక్క చివరలో పలుకబడు ఓంకారమే ప్రణవం అని చెప్పారు. యజ్ఞము, వేదాధ్యయనము, వేదమంత్రోచ్చారణములందన్నిటి ఆద్యంతములందు ఓంకారం ఉచ్ఛరించాలనేది వేద సంప్రదాయం. అందుకే తైత్తిరీయా రణ్యకంలో “యో వేదా దౌ స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః” అని సూచింప బడింది.

“సర్వేభ్యో దుఃఖ భయేభ్యః సంతారయతీతి తారణా త్తారః” అని సర్వవిధములయిన దుఃఖముల నుండి, భయముల నుండి కూడ రక్షింపగల్గినది కాబట్టి దీనిని తారం అని కూడా అంటారు. ఓంకారోచ్చారణ యొక్క అభ్యాసం వలన క్రమంగా చిత్త స్థైర్యం ఏర్పడి దుఃఖ భయాదుల నుండి మనస్సు దూరంగా ఉండగల్గటం వలన రక్తపు పోటు వంటి ప్రమాదాల నుండి కూడా బయట పడవచ్చు. వైద్య శాస్త్రజ్ఞుల అంచనా మేరకు ఇది ఉద్వేగ యుగం. వత్తిడి, వేగం ప్రతిమనిషి పై ఎక్కువగా ఉండే కాలం. చిన్నతనం నుండే బ్లడ్ ప్రెషర్ ప్రభావాలు చాలా మందిలో చూస్తున్నాం. ఆ ఉద్వేగం, ఉద్రేకం ఓంకార సాధన వల్ల నిరోధింపబడతాయి. ఓం యొక్క పరిపూర్ణ జ్ఞానం అందరకూ అందటం ప్రపంచ శాంతికే అత్యంత ప్రధానం.

అమెరికా శాస్త్రవేత్తలు వైద్యపరంగా పై విషయం గుర్తించారు. జార్జియా మెడికల్ కాలేజీకి చెందిన “డా. వెర్మాన్ చార్నెస్” అనే ఆయన సహచరులతో కలసి పరిశోధన చేసి ఈ ధ్యానం వల్ల రక్తపు పోటును తగ్గించటం ఎలా సాధ్యమో గ్రహింప గల్గినట్లు “సైకోమాటిక్ మెడిసిన్” పత్రికలో ప్రచురించారు. జర్మనీలో బ్రస్సెల్స్ నగరంలో ఒక యోగ కేంద్రం నెలకొల్పబడింది. అక్కడ “ఓం” అనేదే కేంద్రంలో స్థాపింప బడినదని, అతి ప్రమాణంగా దాన్ని వారు స్వీకరిస్తారని తమ పర్యటానుభవాల్లో శ్రీ ఎక్కి రాల కృష్ణమాచార్యులుగారన్నారు. ఏసు క్రీస్తు భక్తులయిన వారు తమ సాధనలో భాగంగా ముందు మూడుసార్లు ఓంకారాన్ని ముక్త కంఠంతో ఉచ్ఛరించి “ఓంకార బిందు సంయుక్తం” ఇత్యాదిగా నమశ్శివాయ అనే పంచాక్షర శ్లోకాలు పఠించేవారుట. జెనీవా పట్టణంలో ఆల్బర్ట్ శశీ అనే ఆధ్యాత్మికవేత్త తన మరణ సమయంలో ముఖ్య శిష్యురాలు కెరోల్ అనే భక్తురాలికి ఒక ఉంగరం ప్రసాదించారు. దానిపై సంస్కృత లిపిలో లిఖించి ఉన్న ఓంకారం ఉండటం చూచి ప్రణవ విశిష్టత వారిచే ఉపదేశింప బడ్డట్లు గ్రహించారట. ఇలా ప్రణవాన్ని విలువ గ్రహించిన పాశ్చాత్యులు కూడా ఆరాధించటం గ్రహింపగలం.

జర్మనీలో ఒక కంపెనీ డైరెక్టర్లు ప్రతినెలా సమావేశం ఏర్పాటు చేసుకొని విపరీతంగా తగాదాలాడుకొని పోతూ ఉండేవారు. వారిలో ముఖ్యునికి ఓంకార విశిష్టతను తెల్పే "ఇండియన్ మిస్టిజమ్" అనే గ్రంథం దొరికింది. అది చదివాక మీటింగు మెదట 20 సార్లు ఓంకారం చేసి ఆరంభిద్దామని సూచించటంతో అలాగే చేయసాగారు. అంతకు ముందున్న పంతాలు, పట్టింపులు, తగాదాలు తొలగిపోయి ప్రతివారూ ఇతరుల మాట కూడా విందాం, ఆలోచిద్దాం అనుకొనే మనస్తత్వానికి రావటంతో వివాదాలు సమసిపోయాయి. బల్గేరియాలో విద్యార్థులచే ప్రణవం చేయిస్తారట. అలాంటి మంచి నియమం మనదేశంలో లేకపోవటం మన దురదృష్టం. మనమయినా మన పరిధి అంతటా అలా ప్రణవం చేయించే యత్నం చేస్తే అదే మనకు, మన పరిసరాలకు చాలా మేలు కల్గిస్తుంది. సాధన ద్వారా ప్రణవ శక్తి దేహంలో వ్యాపిస్తే దాని ప్రభావం వారి సంతానంలో కూడా ప్రస్ఫుట మౌతుంది. క్రమ పద్ధతిలో ఓంకారం జపిస్తూ ఉండేవారు మేధావులయిన సంతతిని పొందగల్గుతారు. కాబట్టి యువకుల దశలోనే ప్రణవం అభ్యసిస్తే మన అనంతర తరాల వారంతా మేధావులై జాతి మేధావి జాతి కాగల్గుతుంది. “ఓంకార ప్రభవా దేవాః – ఓంకార ప్రభవా స్స్వరాః ఓంకార ప్రభవం సర్వం” అని మన దేవతలంతా ఓంకారం నుండి పుట్టిన వారే. అందుకే “ఓంకార మాదిం కృత్వా” అని దేవతా సంబంధమైన సర్వకార్యాలూ ఓంకారోచ్చారణ చేసే ఆరంభింప బడతాయి.

వేద పఠనం, మంత్ర పఠనం, మంత్ర జపం, పూజ సద్గ్రంథ పారాయణ, యజ్ఞ యాగాదికం, ఇలా సమస్త హిందూ కార్యాలూ ప్రణవోచ్చారణ లేకుండా మెదలు కావంటే హిందూ ధర్మానికి ఓంకారమెంత కీలకమో అర్థమౌతుంది. ఈ ధర్మంలో ప్రణవానికున్న స్థానం మరి దేనికి లేదనేది తిరుగులేని సత్యం. కాబట్టి హిందువుకు అత్యంత ప్రధానమైనది ఓంకారం. అర్థం చేసుకొంటే ప్రపంచ మంతటికీ అత్యంత ప్రధానమైనది ఓంకారం. బ్రహ్మము – ఆత్మ – ఓం అనేవి మూడూ సమానమైనవే. కాని వీనిలో కన్పించేది, విన్పించేది ఓంకారం మాత్రమే. ఆత్మకలవారందరికీ అవి అనుసరణీయమే. పరబ్రహ్మ స్వరూపమైన ఈ ఓంకారం దేవతలకు కూడా నిరంతరం స్మరింపదగినది. “ఓంకార పంజరశుకీం” అని అమ్మవారిని ఓంకారమనే పంజరంలో చిలుకగా చెప్పిన ఆంతర్యమదే. సకల దేవతలూ అలా ఓంకార పంజరంలో వారే. హరి: ఓం అంటూ ఆరంభించి ఓం తత్ సత్ అని ముగించే మన సంప్రదాయం యావత్తూ ఓంకారం మధ్యనే ఇమిడి ఉంది. ఏ దేవతకయినా ఓంకారంతో కల్పి చెప్తేనే పరిపూర్ణత, వారికి తృప్తి కూడ. అందుకే అష్టోత్తర శతనామాలు, సహస్రనామాలు, కేశవాది చతుర్వింశతి నామాలు సైతం ఓంకారంతోనే చెప్పాలి. కాబట్టి దేవతలందరూ ఓంకార వాచ్యులైతేనే పరిపూర్ణత. అలా హిందూమతంలో దేవతలందరూ ఓంకారంతోనే ఆరాధింపబడటమనే విషయంలో తేడాలేదు. కాబట్టి ఓంకారంతో ఉచ్చరించే, ముక్తిని ప్రధాన ఫలంగా ఇచ్చే దేవతలంతా సమానమే. యహోవా, అల్లా వంటివి ఓంకారంతో ఉచ్చరింపబడేవీ కావు,.ముక్తిని ప్రసాదించేవిగా చెప్పబడవు. కాబట్టి అవి ఈ దేవతల కంటే పూర్తిగా భిన్నాలు. రాజకీయాలతో, లౌకికపు హెచ్చులతో, విశాల దృక్పథమనే పేరుతో అన్నీ కలగా పులగం చేయబోయినా కావు. మన దేవతలలో ఎవరినాశ్రయించినా పరమ ప్రయోజనంగా ముక్తిని పొందగలం. కాన ఈ కొమ్మలలోనే ఒకటి మారి మరొకటి, మరొకటి ఎక్కినా ఫర్వాలేదు. కాని మతమే మారటం ద్వారా ఈ చెట్టే దిగేస్తే ఇక ఈ పరమ ప్రయోజనం పొందలేరు. మనమంతా ఒకే చెట్టు మీదున్నామనుకొనే వీలు లేదు. లౌకిక ప్రయోజనాలు చూచి అదే భుక్తి ఫలంగా భావించి వానిని ఆశ్రయిస్తున్నారు. వారిదెంతటి దురదృష్టము! భుక్తి ముక్తి ఫలమిచ్చే ఈ మహత్తరావకాశం చేతులారా వదలుకొంటే మళ్ళీ ఎన్నిజన్మల కీభాగ్యం పొందగలరో ఎవరు చెప్పగలరు? ఈ చెట్టు దిగకుండా ఉంటే ఎలాగయినా సత్ఫలం పొందగలరు. హిందూమతం వీడిపోతే ఈ సత్ఫలం కోల్పోయినట్లే. కాబట్టి అలా పోతున్నవారి యెడ ద్వేషం చూపక సానుభూతి చూపి యధార్థ తత్వం చెప్పాలి. అలా చెప్పని దోషం మనది కారాదు. వారితో వాదించటం కాక అనుకూల సమయంలో వివరించాలి. లేకుంటే ఆ వ్యక్తి మెదలకుండా చెట్టుదిగి పోవటమే కాక ఈ చెట్టును నరికే యత్నం చేస్తాడు. కళ్ళముందు అలాంటి అనుభవాలు చూస్తూ కూడా మెదలకుండా ఊరుకుంటే మనకు మనమే అన్యాయం చేసుకొన్న వారమౌతాము.

మరికొంత వచ్చే టపాలో...

ముందుమాట

హిందూ ధర్మంలో చాలా కీలకమైన అంశం ఓంకారం. కాబట్టి ఆదిలోనే దానినందిస్తున్నాము. ఓంకారమంటే బ్రహ్మవిద్య. అలాంటి దానిని సామాన్య హిందువుకు కూడా అందించాలనే యత్నం పెద్ద సాహసమే. ఇది ఆత్మవిద్య. ఆత్మకల వారంతా ఆత్మీయతతో చదివి తీరాలి. మీకు గల శ్రద్ధను బట్టి ఇది మీకెంతో ఆత్మానందం కల్గిస్తుంది. మనస్సును ఏకాగ్రం చేసి నిదానంగా దీనిని చదవండి. ఇది మీకు అర్థమయే రీతిని బట్టి మీ స్థాయిని గ్రహించు కోవచ్చు. మీరో మారు చదివితే తప్పక అంతా గ్రహింపగల్గుతారు. కంప్యూటరు విషయం సామాన్యుల కర్థమయేటట్లు చెప్పాలంటే కొన్ని అయినా సాంకేతిక పదాలు ఉపయోగించక తప్పదు. కొంతైనా శాస్త్రీయ పదజాలం రాక మానదు. అలాగే ఈ బ్లాగులో ఏవైనా కొన్ని మాటలు కష్టంగా ఉంటే అవి మనస్థాయికి రాలేవని, మనమే వాని స్థాయినందుకోవాలని గ్రహిద్దాము. అర్థం చేసుకొనే యత్నం చేద్దాము. మహానిధులు దొరకాలంటే కొంత లోతుగా త్రవ్వవలసి ఉంటుంది. నిధులు పైపైనే ఉంటే వాటికా విలువ ఉండదు. కాబట్టి అలాంటి ఓంకార నిధిని కొద్ది కష్టమైనా ఓర్పుతో పొంది దానిని అనుభవంలోకి తెచ్చుకొని ఐహిక, పారమార్థిక ప్రయోజనాలన్నిటినీ పొందగల్గుతారని ఆశిస్తూ,

--సదా సత్సేవలో